Jamili election: 129 రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లులో ఏముంది..! 3 d ago

featured-image

దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్‌స‌భ‌లో ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లుల్లో మొదటిది లోక్‌స‌భ‌, అసెంబ్లీల కాలపరిమితులను సవరించే రాజ్యాంగ సవరణ బిల్లు కాగా రెండోది ఢిల్లీ, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికలకు సంబంధించింది.


 @బిల్లులో ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది?

129వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2024 (ఏకకాల ఎన్నికల నిర్వహణ) లో రాజ్యాంగంలోని మూడు ఆర్టిక‌ల్స్‌ను సవరించడంతో పాటు కొత్తగా ఆర్టికల్ 82ఏను చేర్చాలని బిల్లులో ప్రతిపాదించబడింది.


* ఆర్టికల్ 82ఏ(1): జమిలి బిల్లు ఆమోదం పొందిన తర్వాత సాధారణ ఎన్నికలు జరిగిన పిదప కొలువుదీరే తొలి లోక్‌సభలో రాష్ట్రపతి ఈ క్లాజును నోటిఫై చేయాలి. ఆ రోజునే అపాయింటెడ్ డేగా పరిగణించాలి.


* ఆర్టికల్ 82ఏ(2): అపాయింటెడ్ డే తర్వాత ఏర్పడిన అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి ఆ లోక్‌స‌భ కాల పరిమితితోనే ముగుస్తుంది. అంటే అవసరమైతే, అసెంబ్లీల కాలపరిమితిలో కుదింపు జరుగొచ్చు. అలాగే, లోక్‌స‌భ‌ కంటే ముందు ఏర్పడిన అసెంబ్లీల కాలపరిమితి లోక్‌స‌భ‌ కాలపరిమితికి అనుగుణంగా పొడిగింపు కూడా ఉంటుంది.


* ఆర్జికల్ 82ఏ(3): లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల సంఘం (ఈసీ) ఎన్నికలను నిర్వహిస్తుంది.

* ఆర్టికల్ 82ఏ(4): ఈ క్లాజు జమిలి ఎన్నికలను నిర్వచిస్తుంది. లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలు నిర్వహించడమే దీని లక్ష్యం.

* ఆర్టికల్ 82ఏ(5): కొన్ని అనివార్య పరిస్థితులు తలెత్తినప్పుడు లోక్‌స‌భ‌తో పాటు ఏదైనా అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలను నిర్వహించలేని వెసులుబాటు ఈసీ కలిగి ఉంది.

* ఆర్టికల్ 82ఏ(6): లోక్ సభతో కాకుండా కొంత జాప్యంతో ఎన్నికలు జరిగిన అసెంబ్లీ కాలపరిమితి ఆ లోక్ సభతోనే ముగిసిపోతుంది. 


@ సవరణ చేయబోతున్న ఆర్టికల్స్.. 

* ఆర్టికల్ 83: ఈ ఆర్టికల్‌లో మళ్లీ ఐదు క్లాజులు ఉన్నాయి. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేండ్ల కాలపరిమితి ఉంటుందని తొలి క్లాజ్ పేర్కొంటుంది. 


* ఐదేండ్ల కాలపరిమితితో కొలువుదీరే లోక్ సభ మధ్యలో ర‌ద్ద‌యితే మిగిలిన కాలాన్ని వీగిపోని కాలంగా (అన్ఎక్వైర్డ్ టర్మ్) పరిగణించాలని రెండో క్లాజ్ చెప్తుంది.


* లోక్‌స‌భ ర‌ద్ద‌యిన తర్వాత మిడ్‌ట‌ర్మ్ ఎన్నికలతో కొత్త లోక్‌స‌భ కొలువుదీరుతుందని మూడో క్లాజ్ తెలియజేస్తుంది. అలా ఏర్పడిన కొత్త లోక్‌స‌భ మిగిలిన కాలానికి మాత్రమే (ఐదేండ్ల కంటే తక్కువ) ఉంటుందని నాలుగో క్లాజ్ చెప్తుంది.


* మిడ్‌ట‌ర్మ్‌ ఎలక్షన్స్ ద్వారా కొలువుదీరిన లోక్‌స‌భ‌.. అంతకు ముందు ర‌ద్ద‌యిన లోక్‌స‌భ‌ కాలంతో కలిపి మొత్తంగా ఐదు ఏండ్లు పూర్తికాగానే మళ్లీ సాధారణ ఎన్నికలు నిర్వహించాలని ఐదో క్లాజ్ చెప్తుంది.


* ఆర్టికల్ 172: ఆర్టికల్ 83లోని ఐదు క్లాజులు ఎలాగైతే లోక్‌స‌భ‌ కాలపరిమితికి సంబంధించిన నిబంధనలను వెల్లడించాయో.. ఆర్టికల్ 172 క్లాజులు అసెంబ్లీలకు అలాగే వర్తిస్తాయి. అసెంబ్లీల కాలవ్యవధి అనేది లోక్ సభకు అనుగుణంగానే ఉంటుంది.


* ఆర్టికల్ 327: రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయాలు (ఎలక్టోరల్ రోల్, నియోజకవర్గాల పునర్విభజన వగైరాలు) పార్లమెంట్ నిర్ణయిస్తుందని ఈ ఆర్టికల్లో పేర్కొన్నారు.


* వాస్తవానికి జమిలి ఎన్నికలకు సంబంధించి మూడు బిల్లులు ఉండగా, అందులో రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు, ఒకటి కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు. 


* అయితే, రెండో రాజ్యాంగ సవరణ బిల్లు (పంచాయితీల‌ మరియు మునిసిపాలిటీల ఎన్నికలకు సంబంధించింది)ను రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.


* పంచాయితీలు మరియు మునిసిపాలిటీల ఎన్నికలకు సంబంధించి సవరించాల్సిన ఆర్టికల్స్: 83(2), 85 (28), 172(1) మరియు (2B), 324, 324(A), 325, 356.


@జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే ఎంత మెజారిటీ ఉండాలి:


జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీ సరిపోదు. మూడింట రెండో (2/3) వంతు (67శాతం) ఎంపీల మద్దతు అవసరం. లోక్‌సభలో 543లో 362 మంది ఎంపీలు, రాజ్యసభలో 245లో 164 మంది సభ్యులు మద్దతు అవసరం ఉంది.


@దేశంలో జమిలి ఎన్నికల చరిత్ర:


దేశంలో రాజ్యాంగాన్ని ప్రవేశ పెట్టిన తర్వాత 1951-52, 1957, 1962, 1967లో లోక్‌స‌భ, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1968, 1969లో పలు రాష్ట్రాల అసెంబ్లీలు ఐదేండ్లకు ముందే రద్దు కావడం వల్ల జమిలి ఎన్నికలకు ఆటంకం ఏర్పడింది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD